సుప్రీంకోర్టు సీనియర్ జడ్జీ జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్థాయిలో దూరదృష్టి గల వ్యక్తిగా గుర్తింపు పొందారని కొనియాడారు. ప్రపంచ ఆలోచనా విధానాలు కలిగి స్థానికంగా పనిచేసే బహుముఖ ప్రజ్ఙా శాలిగా కీర్తించారు. ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో భారతదేశం చాలా బాధ్యతాయుతంగా, అంతర్జాతీయ సమాజానికి దగ్గరయ్యిందని తెలిపారు.
ఢిల్లీలో అంతర్జాతీయ న్యాయ సదస్సు-2020 ప్రారంభోత్సవం సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లు దాదాపు 1500 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తున్నారని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో న్యాయవ్యవస్దలో సవాళ్లు ఎదుర్కొనడం సహజమేనని..అయితే న్యాయవ్యవస్థ పాత్ర ఎప్పటికీ ప్రముఖ పాత్రే నని చెప్పారు జస్టిస్ అరుణ్ మిశ్రా.
గౌరవప్రదమైన మానవ జీవితం గురించే మా ప్రధాన ఆందోళన..దానికి బహుముఖ ప్రజ్జాశాలి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం..ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏ విధంగా విజయవంతంగా నడుస్తుందోనని ప్రజలు ఆశ్యర్యపోతున్నారని చెప్పారు. జస్టిస్ అరుణ్ మిశ్రా సుప్రీంకోర్టులో మూడో సీనియర్ జడ్జీగా ఉన్నారు.