కేంద్ర ఎన్నికల కమిషన్ నియామకాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నియామక విధానాన్ని సుప్రీం రద్దు చేసింది. ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే నియమించాలని ఆదేశించింది.
ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. భారత ఎన్నికల సంఘం సభ్యుల నియామక ప్రక్రియలో సంస్కరణలు కోరుతూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ నియామకాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈసీ నియామకాలపై కమిటీనే నియమించాలని ఆదేశించింది. అలాగే ప్రతిపక్ష నేత లేదా విపక్షంలో మెజార్టీ పార్టీ సభ్యులు ఉండాలని పేర్కొంది.
కాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, ఇతర అధికారుల నియామకాల విషయం ఈ మధ్య వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఎన్నికల అధికారులు కేంద్రం కనుసన్నల్లో నడుస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అధికారులు.. కేంద్రం చెప్పినట్లు వింటున్నారని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీం ఇచ్చిన తీర్పు కీలకంగా మారింది.