ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మొత్తం రెండు పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ డాక్యుమెంటరీని లింకులను సోషల్ మీడియా నుంచి బ్లాక్ చేయడానికి అత్యవసర అధికారాలు ఉపయోగించడానికి పిటిషన్ దారులు సవాల్ చేశారు. డాక్యుమెంటరీపై నిషేధం విధించడాన్ని ఏక పక్షమైన నిర్ణయంగా, రాజ్యాంగ విరుద్ధం అని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
వాదనలు విన్న న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు పంపింది. నోటీసులపై మూడు రోజుల్లోగా స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ లో చేపట్టనున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. బీబీసీ డాక్యమెంటరీని నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ జర్నలిస్టు ఎన్.రామ్, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్లు వేశారు.
గుజరాత్ అల్లర్లపై బీబీసీ ఇటీవల డాక్యుమెంటరీ రూపొందించింది. ఇందులో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలకు సంబంధించి కొన్ని అభ్యంతరకర అంశాలు ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో జనవరి 21న డాక్యుమెంటరీకి సంబంధించిన యూట్యూబ్ వీడియోలపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో పాటు దీనికి సంబంధించిన లింకులను ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయకుండా నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేసింది.