గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల పిటిషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు పంపింది. అనంతరం విచారణను ఈ నెల 27కు ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
మొదట గవర్నర్‌కు నోటీసులు పంపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం భావించింది. దీనికి గవర్నర్ తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత అభ్యంతరం తెలిపారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌కు నోటీసులు జారీ చేస్తే అది తప్పుడు సందేశాలను పంపుతుందని ఆయన వాదనలు వినిపించారు.
రాబోయే రోజుల్లో ఇదొక సంప్రదాయంగా మారుతుందని ఆయన తెలిపారు. గవర్నర్ పదవిలో వున్న వారికి నోటీసులు ఇవ్వడం సరికాదని, ఈ విషయంలో ధర్మాసనం మరోసారి ఆలోచించాలని ఆయన కోరారు. దీంతో కేంద్రానికి నోటీసులు ఇస్తామంటూ ధర్మాసనం వెల్లడించింది.
పది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపలేదని తెలంగాణ సర్కార్ పేర్కొందన్నారు. కానీ అందులో కొన్ని బిల్లులు ఇటీవలే రాజ్‌భవన్‌కు చేరుకున్నాయని ఆయన వివరించారు. పూర్తి వివరాలను తాను తెలంగాణ రాజ్‌భవన్ నుంచి తెలుసుకోవాల్సి ఉన్నదని ఆయన అన్నారు.
దానికి కొంత సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఏయే బిల్లులు ఎందుకు పరిశీలనలో ఉన్నాయో, ఆమోదం పొందకుండా ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో తాను వివరాలను తీసుకోవాల్సి ఉందన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. అన్ని వివరాలను తెప్పించుకుని సుప్రీంకోర్టుకు తెలియజేయాలని సొలిసిటర్ జనరల్‌కు సూచించింది. తదుపరి విచారణను మార్చి 27కు వాయిదా వేసింది.