ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఉచిత పథకాలను అమలు చేస్తున్న రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రెండు రోజుల కింద అపెక్స్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అలాంటి పార్టీలకు సంబంధించిన ఎన్నికల గుర్తును నిలిపివేయాలని.. లేదంటే పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని పిటిషనర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ విజ్ఞప్తి చేశారు.
అందుకు స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. 4 వారాల్లోగా దీనికి సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు ఆదేశించింది.
ఓటర్ల మన్నన పొందడం కోసం రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తూ అడ్డదారుల్లో అమలు చేస్తున్న ప్రజాకర్షక విధానాలను నిషేధించాలని పిటిషనర్ కోరారు. ఓటర్లను మభ్యపెట్టి అనుచిత లబ్ధి పొంది.. తద్వారా అధికారంలో కొనసాగేందుకు చేసే ప్రయత్నాలు ఎన్నికల పవిత్రతను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.
పోటీ చేసే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఆదర్శానికి విఘాతం కలిగిస్తాయని తెలిపారు. సముచిత నివారణ చర్యలు తీసుకునేలా భారత ఎన్నికల సంఘానికి ఆదేశించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు పిటిషనర్.