కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొస్తున్న సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు వాట్సప్, ఫేస్ బుక్ లకు భారత సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీల కొత్త ప్రైవసీ పాలసీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీం నోటీసులిచ్చింది. విచారణ పూర్తయ్యే వరకు వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీపై స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు.
ప్రధాన న్యాయమూర్తి బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య దర్మాసనం ఈ విచారణ చేపడుతూ… కొత్త పాలసీ వల్ల ప్రజల ప్రైవసీకి విఘాతం కలిగే అవకాశం ఉంటే తాము జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫేస్ బుక్, వాట్సప్ లు 2-3ట్రిలియన్ డాలర్ల సంస్థలైనప్పటికీ ప్రజలు డబ్బు కన్నా వారి వ్యక్తిగత గోప్యతకు అధిక ప్రాధాన్యతనిస్తారని వ్యాఖ్యానించింది.
నిజానికి వాట్సప్ తన కొత్త ప్రైవసీ పాలసీని ఫిబ్రవరి 5 నుండే అమలు చేస్తామని వాట్సప్ ప్రకటించింది. కానీ ప్రజల నుండి వచ్చిన తీవ్ర విమర్శలతో కేంద్రం వాట్సప్ సంస్థకు నోటీసులివ్వటంతో వాట్సప్ వెనక్కి తగ్గింది. ఆ గడువును మే 14కు పొడిగించింది.