ఏపీలో రాజకీయంగా వివాదాస్పదమైన జీవో నెంబర్ 1 పై సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చింది. రోడ్ల పైన సభలు – ర్యాలీల నిర్వహణ పైన ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 పై విచారణ ముగిస్తున్నట్లు సుప్రీం తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉండటంతో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే, ఈ కేసు హైకోర్టులో తిరిగి 23న విచారణకు రానుండటంతో ఆ కేసును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారించాలని సుప్రీం కీలక సూచన చేసింది. ఈ జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
జీవో 1 పై ఇటీవల ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచుడ్, పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం నేడు విచారించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‌పై జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం చేపడుతుందని ధర్మాసనం వెల్లడించింది.
ఈ నెల 23న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ చేపట్టాలని సీజేఐ సూచించారు. వాద ప్రతివాదులు ఇరువురూ… అన్ని అంశాలను డివిజన్ బెంచ్ ముందు ప్రస్తావించుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. అన్ని అంశాలు ఓపెన్‌గా ఉంచుతున్నామని సీజేఐ ధర్మాసనం వెల్లడించింది. కేసు మెరిట్స్‌పై ఇప్పుడు ఎలాంటి విచారణ చేపట్టడం లేదని సీజేఐ పేర్కొంది.
టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల్లో తొక్కిసలాటతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. దీని ద్వారా రోడ్ల పైన సభలు – ర్యాలీల నిర్వహణ పైన ఆంక్షలు విధించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పైన రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కొద్ది రోజుల క్రితం కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబును ఈ జీవో కారణంగా సభలు – రోడ్ షోలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ జీవో పైన చంద్రబాబు ఫైర్ అయ్యారు. బ్రిటిష్ చట్టం అమలు చేస్తారా అని నిలదీసారు. మరోవైపు ఈ జీవోను అమలు చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీంతో, ఈ నెల 23న హైకోర్టులో విచారణ.. వెలువడే ఆదేశాల పైన ఉత్కంఠ కనిపిస్తోంది.