కరోనా నేపథ్యంలో వయసు పైబడిన వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు 2020 ఆగస్టు 4న ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డితో కూడిన ధర్మాసనం సవరించింది.
కరోనా వైరస్‌తో ప్రభావితమయ్యే అవకాశం ఉన్న వృద్ధులను ఆసుపత్రిలో చేర్చుకోవడం సహా… చికిత్సలో తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందింగా గతంలో ప్రభుత్వ ఆస్పత్రులను మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను ఒడిశా, పంజాబ్ మినహా మరే రాష్ట్రం పట్టించుకోలేదని సీనియర్ న్యాయవాది అశ్వినీ కుమార్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పైగా ప్రైవేటు ఆసుపత్రులకు కూడా మీ ఆదేశాలు వర్తింపజేయాలని కోర్టును కోరారు.
ఈ నేపథ్యంలో స్పందించిన న్యాయస్థానం గత ఉత్తర్వులను సవరిస్తూ తాజా ఆదేశాలు జారీచేసింది. వృద్ధులకు వైద్యం విషయంలో అశ్వినీ కుమార్ సూచనలపై స్పందించేందుకు రాష్ట్రాలకు మూడు వారాల గడువునిచ్చింది న్యాయస్థానం.