ఎమ్మెల్యేలకు ఎరకేసుపై సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. కేంద్రం చేతిలో సీబీఐ చిలుక లాగా మారిందని ఆయన అన్నారు. కేసు సీబీఐ చేతుల్లోకి వెళితే ఆధారాలు ధ్వంసమవుతాయన్నారు.
ఈ కేసు దర్యాప్తును ఎట్టి పరిస్థితుల్లోనూ సీబీఐకి ఇవ్వవద్దని ఆయన సుప్రీం కోర్టును కోరారు. సిట్ దర్యాప్తు జరుగుతుండగానే బీజేపీ నేతలు పిటిషన్ వేశారని ఆయన పేర్కొన్నారు. దురుద్దేశ పూర్వకంగానే బీజేపీ నేతలు సీబీఐ విచారణ కోరారని ఆయన తెలిపారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ ఒకసారి సమర్థించిందని, మరోసారి వ్యతిరేకించిందన్నారు. కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్తే పూర్తిగా నీరు గారి పోతుందన్నారు. ఇంతలో కోర్టు సమయం ముగిసి పోయింది. దీంతో వాదనలను న్యాయస్థానం నిలిపి వేసింది.
శనివారం నుంచి కోర్టుకు హోళీ సెలవులు ఉన్నాయి. ఈ క్రమంలో తదుపరి విచారణను శుక్రవారమే చేపట్టాలని న్యాయస్థానాన్ని దవే కోరారు. కానీ శుక్రవారం విచారణ సాధ్యం కాదని ధర్మాసనం పేర్కొంది. కేసును సీజేఐ ధర్మాసనానికి జస్టిస్ గవాయ్ ధర్మాసనం రిఫర్ చేసింది. తదుపరి విచారణపై సీజేఐ నిర్ణయిస్తారని ధర్మాసనం వెల్లడించింది.