కరోనా వైరస్‌కు విరుగుడుగా ఎర్రచీమల చట్నీని ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎంతో మంది ఏదైనా వ్యాధిబారిన పడినప్పుడు తమకు తెలిసిన చిట్కాలను ఉపయోగిస్తుంటారని, వారికి అవి పనిచేసినంత మాత్రానా దేశమంతా దాన్నే పాటించాలని చెప్పలేమని స్పష్టం చేసింది.
కరోనా వైరస్ నివారణకు పిటిషనర్ ఎర్రచీమల చట్నీని తినాలనుకుంటే తినవచ్చని, దాన్ని ఎవరూ ఆపలేరని తెలిపింది. అంతేకానీ దేశ ప్రజలని కూడా అదే తినాలని తాము ఆదేశించలేమని తేల్చిచెప్పింది. సంప్రాదాయక చిట్కాలను అనుసరిస్తే.. దాన్ని పర్యవసనాలను పాటించినవారే అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది హైకోర్టు. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును ఇచ్చింది.
ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశాడు. ఇప్పటికే ఈ విషయం గురించి ఒడిశా హైకోర్టును ఆశ్రయించగా.. ఆయూష్ శాఖ, సీఎస్ఐఆర్‌ను ఈ విషయాన్ని పరిశీలించాలని ఆదేశించిందని పిటిషనర్ గుర్తు చేశాడు. అయితే ఆ రెండు సంస్థలు ఈ ప్రతిపాదనను కొట్టివేశాయని.. దీంతో మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తే తమ పిటిషన్‌ను కొట్టివేసిందని తెలిపాడు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టుగా వివరించాడు. తాజా విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కూడా స్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌ను ఇక్కడితో ముగిస్తున్నట్టు వెల్లడించింది. ఇదిలా ఉంటే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి వ్యాక్సిన్ వేయించాలని, ఎర్రచీమల చట్నీ పేరుతో వ్యాక్సిన్ వేసుకోకుండా ఉంటాడేమోనని తెలిపింది.
ఇదిలా ఉంటే ఒడిశా, చత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎర్రచీమల చట్నీని దగ్గు, జలుబు, ఆస్తమా వంటి జబ్బులను నయం చేసే చిట్కాగా పాటిస్తుంటారు.