రిషికొండలో టూరిజం భవనాల నిర్మాణాలపై ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేయాలని.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. చదును చేసే ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఇప్పటికే నిర్మాణాలున్న ప్రాంతంలో యథావిధిగా నిర్మాణాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఈ ప్రాజెక్ట్ కేసు విచారణను హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ట్రైబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని తెలిపింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్జీటీ బేఖాతరు చేయడం తగదన్న న్యాయస్థానం.. ఉత్తర్వులు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అప్పటి వరకు ఎన్జీటీలో విచారణ జరపరాదని తెలిపింది. ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది న్యాయస్థానం.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ ఆధారంగా ప్రాజెక్టు పనులను నిలిపివేస్తూ ఎన్జీటీ స్టే ఇచ్చింది. ఇది కరెక్ట్ కాదంటూ ఏపీ సర్కార్ పిల్ వేసింది. ఈ పిటిషన్ పై మంగళవారం వాదనలు జరిగాయి. ఈ ప్రాజెక్టుతో 300 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఓ ఎంపీ రాసిన లేఖ ఆధారంగా ఎన్జీటీ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని వివరించింది.
విచారణ బుధవారానికి వాయిదా పడగా… తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. రిషికొండ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యథావిధిగా నిర్మాణాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.