హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. అజారుద్దీన్ నేతృత్వంలోని హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు తీర్పునిచ్చింది. ప్రస్తుత కమటీ స్థానంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర రావుతో ఏకసభ్య కమిటీని నియమించింది.
హెచ్‌సీఏలో ఎన్నికలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని ఆలోచన మేరకు సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్ సీఏ అంబుడ్స్ మెన్‌గా జస్టిస్ దీపక్ వర్మ నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టు మెట్లెక్కారు.
హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ బాధ్యతను జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అప్పగించాలని సుప్రీం కోర్టు పిటిషనర్ల తరఫు న్యాయవాది దవే కోరారు. ఈ క్రమంలో హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అన్ని విధాల సహకరించాలని హెచ్ సీఏకు సూచించింది.
ఇక నుంచి హెచ్‌సీఏ వ్యవహారాలను నూతన కమిటీ పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ నివేదికను అనుసరించి తదుపరి ఆదేశాలు ఉంటాయని సుప్రీం కోర్టు చెప్పింది. హెచ్‌సీఏకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు సూచించింది.