బళ్లారిని సందర్శించేందుకు మైనింగ్ బేరన్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డికి సుప్రీంకోర్టు అనుమతించింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి 2015 నుంచి ఈయన బెయిల్ పై ఉన్నప్పటికీ కర్ణాటకలో బళ్లారిని, ఏపీలో అనంతపురం, కడప జిల్లాలను విజిట్ చేయరాదని కొన్ని షరతులను కోర్టు విధించింది. అయితే బళ్లారిలో ఉన్న తన కూతురిని చూసేందుకు, నాలుగు వారాల పాటు అక్కడ ఉండేందుకు తనను అనుమతించాలని జనార్దనరెడ్డి కోరారు.
తన కుమార్తె ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్. షా, కృష్ణ మురారితో కూడిన బెంచ్ విచారించి.. సీబీఐ వాదనను తెలుసుకోగోరింది. గత నెల 30 న ఈ కేసు కోర్టు ముందుకు రాగా అక్టోబరు 10 న తమ ఉత్తర్వులను ప్రకటిస్తామని బెంచ్ పేర్కొంది.
తన బెయిల్ పిటిషన్ లోని నిబంధనను సడలించాలని గాలి. లోగడే కోర్టును అభ్యర్థించారు. సోమవారం దీన్ని విచారించిన కోర్టు.. ఈ కేసులో ట్రయల్ కోర్టు రోజువారీగా వెంటనే విచారణ మొదలుపెట్టాలని, ఆరు నెలల్లో పూర్తి చేయాలని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టును ఆదేశించింది. బళ్లారిలో జనార్దనరెడ్డి నవంబరు 6 వరకు ఉండవచ్చునని కానీ విచారణ పూర్తి అయ్యేంతవరకు బళ్లారి బయటే ఉండాలని సూచించింది.
ట్రయల్ ని జాప్యం చేయడానికి జనార్దన రెడ్డి ఎలాంటి ప్రయత్నం చేసినా.. తీవ్ర పరిణామాలు ఉంటాయని బెంచ్ హెచ్చరించింది. .ఈయన కుమార్తె ఇటీవల బెంగుళూరులో చిన్నారికి జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. . అయితే ఆమె బళ్లారికి వఛ్చినట్టు తనకు తెలిసిందని జనార్దనరెడ్డి కోర్టుకు తెలిపారు.