వివాదాస్పదమైన తన వెబ్ సిరీస్ నేపథ్యంలో తనకు అరెస్టు వారెంట్లు జారీ కాకుండా ‘రక్షణ’ కల్పించాలంటూ టీవీ, సినీ ఫిల్మ్ మేకర్ ఏక్తా కపూర్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు మండిపడింది. మీరు యువతరం ఆలోచనలను తప్పుదారి పట్టిస్తున్నారని, ఇలాంటి పిటిషన్లను వేయడం మానుకోవాలని సూచించింది. ఇప్పటికి మీకు కోర్టు ఖర్చులు వేయకుండా వదిలేస్తున్నామని, ఇకపై మళ్ళీ ఇలా వస్తే వాటిని విధిస్తామని హెచ్చరించింది.
ఈమె నిర్మించిన వెబ్ సిరీస్ .. ‘ఎక్స్ఎక్స్ఎక్స్’ పై ఇదివరకే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్ .. ఆల్ట్ బాలాజీ లో ప్రసారమయిన ఇందులో సైనికులకు సంబంధించి అసభ్యకరమైన కంటెంట్ ఉందని లోగడ శంభు కుమార్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. దీన్ని ఆపివేయాలని, ఇది సైనికుల కుటుంబాల సెంటిమెంట్లను దెబ్బ తీసేదిగా ఉందన్నాడు.
దీనిపై బీహార్ లోని బెగుసరాయ్ కోర్టు ఏక్తా కపూర్ కి మొదట సమన్లు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో కోర్టు ఆమెకు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అయితే ఈ వారంట్లను సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తనను అరెస్టు చేయకుండా చూడాలని కోరింది. ఈమె తరఫున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహ్తగి వాదిస్తూ.. తన క్లయింటుకు రక్షణ కల్పించాలన్నారు. గతంలో కూడా ఆమెకు ఇలాగే వారెంట్లు జారీ అయ్యాయన్నారు. కానీ జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ సి.టి. రవికుమార్ లతో కూడిన బెంచ్.. ఏక్తా కపూర్ ని మందలించింది. మీరు యువతరం మనస్సులను కలుషితం చేస్తున్నారని.. ఓటీటీ కంటెంట్ అందరికీ అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని విస్మరిస్తున్నారని తప్పు పట్టింది. అసలు ఇలాంటి పిటిషన్ దాఖలు చేసినందుకు మీకు కోర్టు ఖర్చులను వేయాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ఇదే విషయాన్నీ మీ క్లయింటుకు చెప్పండి అని ముకుల్ రోహ్తగిని ఉద్దేశించి సలహా ఇచ్చింది.