ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై చర్యలు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు అన్ని పిటిషన్లను తిరస్కరించింది. సున్నితమైన ఈ అంశంలో కేంద్ర హోంశాఖ చట్టపరంగా స్పందిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్లను వెనక్కి తీసుకోవాలని పిటిషనర్లకు సూచించింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా కేంద్ర ప్రభుత్వాన్నే పిటిషనర్లు ఆశ్రయించవచ్చని సుప్రీం తెలిపింది.
ఎర్రకోటపై జెండా ఎగరవేయడం, పోలీసులపై దాడి ఘటనల నేపథ్యంలో సుప్రీం కోర్టులో ఇటీవల పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రిపబ్లిక్ డే నాటి ఘటనలపై సుప్రీం రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని ఒక పిటిషన్.. అలాగే రైతులను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించొద్దంటూ మరో పిటిషన్ కూడా ఇందులో ఉన్నాయి.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. అనంతరం వాటిని తిరస్కరిస్తున్నట్టు తెలిపింది.