ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పై ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అయితే… ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడినందున తక్షణమే ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయాలని ఈసీకి సూచిస్తూ విచారణను ముగించింది.
ఈ సందర్భంగా సుప్రీం కోర్టు… ఎన్నికల ఎప్పుడు, ఎలా నిర్వహించాలనే అంశంలో ఈసీదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. కొత్తగా ప్రభుత్వం ఎవైనా పథకాలు మొదలుపెట్టాలంటే మాత్రం ఎన్నికల కమీషనర్‌తో చర్చించి, ఈసీ అనుమతితో మొదలుపెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న తరుణంలో ఏపీలో స్థానిక సంస్థలు నిర్వహించటం అసాధ్యమంటూ కమీషనర్ రమేష్ కుమార్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవటంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం నేనా… ఆయనా అంటూ ప్రశ్నించారు. ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, ప్రతిపక్ష నేత చంద్రబాబు సామాజిక వర్గంకు చెందిన కమీషనర్ రమేష్ కుమార్ చంద్రబాబు కోసమే వాయిదా వేశారంటూ వైసీపీ ఫైర్ అయ్యింది. అంతేకాదు ఈ అంశంపై సీఎం జగన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేయగా, కమీషనర్ కూడా గవర్నర్‌ను కలిశాడు.
అయితే, వాయిదా వేయకుండా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సీఎస్ ఈసీకి లేఖ రాసినా… సాధ్యం కాదంటూ ఈసీ స్పష్టం చేసింది.