వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాగు చట్టాలను సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని తప్పుబట్టింది. సమస్య పరిష్కారం అయ్యేవరకు చట్టాలను నిలుపుదల చేయాలని సూచించింది. లేదంటే తామే స్టే విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆందోళనల్లో పాల్గొంటున్న రైతులు చనిపోతుంటే కేంద్రానికి కనిపించడం లేదా అని కేంద్రాన్ని నిలదీసింది. వృద్ధులు, మహిళలు కూడా పోరాటం చేస్తున్నారని గుర్తు చేసింది. ఇప్పటికే పరిస్థితి విషమించిందని.. రక్తపాతం జరిగితే దానికి ఎవరు బాధ్యలు అని ప్రశ్నించింది. ఇన్ని రోజులు గడిచినా పరిష్కారం చూపకపోవడమేంటని కేంద్రంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
సుప్రీం వ్యాఖ్యలపై అటార్నీ జనరల్ స్పందిస్తూ.. చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. సుప్రీం కోర్టు గతంలో చట్టాలు నిలుపుదల చేసిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని భావిస్తే తప్ప స్టే విధించలేరని కోర్టుకు చెప్పారు. ఈ నెల 15న చర్చలు ఉన్నందున.. అప్పటివరకు వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ఈ నెల 7న కేంద్రం- రైతు సంఘాల మధ్య జరిగిన ఎనిమిదో విడత చర్చలు కూడా విఫలం అయ్యాయి. మూడు చట్టాలను వెనక్కి తీసుకునేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు తెగేసి చెప్పాయి. కాగా ఈ నెల 15న తొమ్మిదోసారి చర్చలు జరగనున్నాయి.