ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తే.. అభ్యంతరం వ్యక్తం చేస్తే దేశద్రోహం ఎలా అవుతుందని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన అత్యున్నత ధర్మాసనం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ అభిప్రాయంతో విభేదించిన మాత్రాన దేశద్రోహం అనలేమని స్పష్టం చేసింది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ఫరూక్ అబ్దాలపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు.. ఆ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి రూ. 50 వేల ఫైన్ వేసింది సుప్రీం కోర్టు.
2019 ఆగస్టులో ఆర్టికల్ 370ను రద్దు చేసిన కేంద్రం ప్రభుత్వం.. జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడంపై ఫరూక్ అప్పట్లో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పాకిస్థాన్, చైనా మద్దతుతోనే ఆయన ఆ విమర్శలు చేశారని.. ఇందుకోసం ఆ దేశాలకు నుంచి సాయం పొందుతున్నారని ఆరోపిస్తూ ఆయనపై సుప్రీంలో పిటిషన్ దాఖలైంది.
పిటిషనర్ ఆరోపణలతో సుప్రీం ఏకీభవించలేదు. అలాగే పాకిస్థాన్, చైనా సాయం కోరినట్లు ఆధారాలు కూడా ఏవీ సమర్పించకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు పిటిషనర్లయిన రజత్ శర్మ, నేహ్ శ్రీవాస్తవకు రూ. 50 వేల జరిమానా విధించింది సుప్రీం కోర్టు.