12 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో.. శారీరక స్పర్శ( స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్) లేనందున నిందితుడిని బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ క్రమంలో తాజాగా ఆ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత కలతపెట్టేదిగా ఉందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వినిపించిన వాదనలతో.. ఈ ఉత్తర్వులను జారీ చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేత్రుత్వంలోని ధర్మాసనం ఈ మేరకు స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
12 ఏళ్ల మైనర్ బాలికపై కొంతకాలం క్రితం 39ఏళ్ల ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. నాగ్ పూర్ బెంచెకు చెందిన మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలాతో కూడిన ఏక సభ్య ధర్మాసనం విచారణ జరుపుతూ.. చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.
పోక్సో చట్టం ప్రకారం.. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపులకు కిందకు రాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఓ బాలిక చెస్ట్ భాగాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని… చట్టం ఇదే విషయాన్ని చెబుతోందని తీర్పు సందర్భంగా చెప్పారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.