ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ బస్తీ వాసులకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. రైల్వే శాఖకు చెందిన ప్రాంతంలోని ఆక్రమణదారులను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం గురువారం స్టే ఇచ్చింది. ఒక్కరాత్రిలో 50 వేలమందికి పైగా ప్రజలను ఖాళీ చేయించలేమని పేర్కొంది. ఈ కేసును మానవతా దృక్పథంతో చూడవలసి ఉందని, అందువల్ల ప్రజలను దృష్టిలో నుంచుకొని ఓ పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉందని వ్యాఖ్యానించింది.
హల్ద్వానీ లోని బన్ ఫూల్పుర ఏరియాలో సుమారు 29 ఎకరాల భూమి తమదేనని, అయితే ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు బస్తీలను ఏర్పరచుకుని దీన్నిఅక్రమంగా ఆక్రమించుకున్నారని రైల్వే శాఖ లోగడ పేర్కొంది. దీనిపై హైకోర్టుకు ఎక్కడంతో ఈ నెల 9 లోగా ఇక్కడివారిని ఖాళీ చేయించాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే వీటిని సవాలు చేస్తూ.. బస్తీవాసులు కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ ప్రాంతంలో ఓ బ్యాంక్ తో సహా పలు స్కూళ్ళు, ఆలయాలు, మసీదులు, షాపులు ఉన్నాయి. సుమారు 400 కుటుంబాల వారు ఇళ్ళు నిర్మించుకున్నారు. ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు అమలైన పక్షంలో మెగా కూల్చివేతలకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇలా అయితే తామంతా ఎక్కడకు పోవాలని వీరంతా ఇన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు.
వీరి పిటిషన్ ను జస్టిస్ ఎస్.కె. కౌల్, జస్టిస్ అభయ్ ఎస్. ఓకా విచారిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు నోటీసులు జారీ చేశారు. ఈ సమస్యకు సానుకూలమైన పరిష్కారం అవసరమని ఈ బెంచ్ పేర్కొంటూ.. దీనిపై ఫిబ్రవరి 7 న తదుపరి విచారణ జరగాలని నిర్ణయించింది. ఈ బస్తీ వాసుల పునరావాసానికి ఓ పథకం రూపొందించాలని, వీరి హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని.. అదే సమయంలో రైల్వే శాఖ అవసరాలను కూడా పరిశీలించవలసి ఉంటుందని కోర్టు పేర్కొంది.