ఢిల్లీలోని జహంగీర్ పురిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ విషయంలో స్టేటస్ కో(యథాతద స్థితిని) పాటించాలని ఉత్తర ఢిల్లీ మున్సిపల్ అధికారులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలపై గురువారం వాదనలను విననున్నట్టు సుప్రీం కోర్టు వెల్లడించింది.
అల్లర్లు జరిగిన జహంగీర్ పురిలో కూల్చివేత పనులు పూర్తిగా చట్ట విరుద్దమని సీనియర్ న్యాయవాదు దుశ్యంత్ దవే, కపిల్, సిబల్, ప్రశాంత్ భూషణ్ లు అన్నారు. దీనికి సంబంధించి కనీసం ఎవరికీ నోటీసులు కూడా ఇవ్వలేదని సీజేఐ ఎన్వీ రమణ దృష్టికి వారు తీసుకు వెళ్లారు.
దీంతో స్పందించిన సీజేఐ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే కోర్టు ఆదేశించిన తర్వాత కూడా కొద్ది సేపు అక్రమ నిర్మాణాలను తొలగించినట్టు కొనసాగింది. కోర్టు ఆదేశాలు తమకు ఇంకా అందలేదని, అందువల్ల అక్రమ నిర్మాణాల కూల్చవేత కొనసాగుతుందని మేయర్ ఇక్బాల్ సింగ్ తెలిపారు.
ఈ విషయాన్ని సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే సీజేఐ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ఆదేశాలను అధికారులకు వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు కూల్చి వేత కార్యక్రమాన్ని ఆపివేశారు.