జోషీమఠ్ పై అత్యవసర విచారణ చేపట్టాలన్న పిటిషనర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. జనవరి 16 న ఈ పిటిషన్లను విచారిస్తామని పేర్కొంది. దేశానికి ముఖ్యమైన ప్రతి అంశంపైనా ఈ కోర్టుకు రావలసిన అవసరం లేదని, ఇలాంటి వాటిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యవస్థలు చూసుకుంటాయని స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ డీ.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ ను విచారిస్తోంది.
స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి తరఫున అడ్వొకేట్ పరమేశ్వర్ నాథ్ మిశ్రా.. దీన్ని దాఖలు చేశారు. జోషిమఠ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. జోషి మఠ్ లో పెద్దఎత్తున పారిశ్రామికీకరణ కారణంగా అక్కడ ఇళ్ళు, రోడ్లు పగుళ్లు వారుతున్నాయని, వేలాది ప్రజలు నిరాశ్రయులవుతున్నారని ఆయన అన్నారు. వారి తక్షణ పునరావాసం, వారికి ఆర్ధిక సాయం ఎంతయినా అవసరమని పేర్కొన్నారు.
ఈ విపత్కర సమయంలో అక్కడి ప్రజలను ఆదుకోవాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఆదేశించాలని అభ్యర్థించారు. మానవ ప్రాణాలను పణంగా పెట్టి అభివృద్ధి అన్నది సహేతుకం కాదని, సామాన్య ప్రజలకు ఏదైనా హాని జరిగితే అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతే అవుతుందన్నారు.
జోషి మఠ్ లో తమ పూర్వీకుల ఇళ్లను కూలగొట్టే కార్యక్రమానికి అధికారులు పూనుకోవడంతో అనేకమంది కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్నేళ్ళుగా తాము ఉంటున్న ఇళ్ళు, ఇతర కట్టడాలు నేలమట్టం కానున్నాయని, కానీ తాము సురక్షితంగా ఉండాలంటే..ప్రమాదకరంగా మారిన వీటిని ఖాళీ చేయక తప్పడం లేదని స్థానికులు పేర్కొన్నారు. ఇక్కడ అప్పుడే రెండు హోటళ్లను అధికారులు కూల్చివేశారు. జోషి మఠ్ కి సమీపంలోని కర్ణప్రయాగ్ లో కూడా కొండచరియలు విరిగి పడుతున్న కారణంగా అనేక ఇళ్లలో పగుళ్లు కనిపిస్తున్నాయి. సుమారు 50 ఇళ్ళు ప్రమాదకరంగా మారడంతో ఆ ఇళ్లలోనివారు వాటిని ఖాళీ చేయడం ప్రారంభించారు.