షహీన్ బాగ్ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత నెల రోజులకు పైగా ఢిల్లీలోని షహీన్ బాగ్ లో నడి రోడ్డుపై మహిళలు పెద్ద ఎత్తున నిరసన దీక్షలో కూర్చున్నారు. వారు రోడ్డుపై దీక్ష చేయడం వల్ల నోయిడా-సౌత్ ఢిల్లీల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతుందని వారిని వెంటనే అక్కడి నుంచి తొలగించాల్సిందిగా కోరుతూ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు (శుక్రవారం) విచారణ ఉండగా…ఢిల్లీలో శనివారం అసెంబ్లీ ఎన్నికలుండడంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎన్నికలను ప్రభావితం చేయాలనుకోవడం లేదని కోర్టు పేర్కొంది.
వాయిదా వేయడమంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు విచారణ జరగదని పిటిషనర్ వాదించగా..జస్టిస్ ఎస్.కె. కౌల్ నవ్వుతూ ”ద క్యాట్ ఈజ్ అవుటాప్ బ్యాగ్ ( అందులో ఏముందో తెలిసిపోయింది)” అన్నారు. వాయిదాకు అదే కారణమని సమాధానమిచ్చారు. అందుకోసమే సోమవారం రమ్మంటున్నాం…ఎన్నికలను మేమెందుకు ప్రభావితం చేయాలి..? సమస్యను మేము అర్ధం చేసుకున్నాం…దాన్ని ఎలా పరిష్కరించాలో మేము చూస్తాం…సోమవారం విచారిస్తాం…అప్పటికి మేము మరింత స్పష్టతతో ఉంటాం” అని జస్టిస్ ఎస్.కె. కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్ ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతే కాదు…పిటిషన్ ను హైకోర్టుకు ఎందుకు తిప్పి పంపకూడదో వివరించేందుకు సోమవారం సమాధానంతో రమ్మని ధర్మాసనం హెచ్చరించింది.
షహీన్ బాగ్ నిరసనకారులను ఉన్నపళంగా అక్కడి నుంచి తొలగించాలని…రోడ్లపై ఉద్యమాలు, నిరసనలు జరక్కుండా ఆంక్షలు విధించాలని పిటిషనర్ తన పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరారు.