మహారాష్ట్ర రాజకీయంలో ప్రతిష్టంభనలు ఇంకా తొలగిపోలేదు. ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో రెండో రోజు విచారణ తీవ్ర ఉత్రంఠను రేపింది. గంటన్నర పాటు ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం బలపరీక్షఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే విచారణను రేపు పదిన్నరకు వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా బీజేపీ గవర్నర్ కు అందజేసిన లేఖను, ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీని కోరుతూ గవర్నర్ అందజేసిన లేఖను బీజేపీ సుప్రీంకోర్టు ధర్మాసనానికి సమర్పించింది. 54 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కూడా బీజేపీ సుప్రీంకోర్టుకు అందజేసింది. ఆ లేఖలన్నింటిని ధర్మాసనం పరిశీలించింది. అనంతరం ఇరువర్గాల వాదనలు ధర్మాసనం విన్నది. 54 మంది ఎన్సీపీ సభ్యుల సంతకాలున్న లేఖ అజిత్ పవార్ ను ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పటిదని శివసేన-ఎన్సీపీ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. వాటిలో అజిత్ పవార్ సంతకం లేదని తెలిపింది. బీజేపీకి నిజంగా మెజార్టీ ఉంటే 24 గంటల్లో సభలో బలపరీక్ష నిర్వహించాలని..బలపరీక్ష నిర్వహించడానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు 154 మంది ఎమ్మెల్యేల మద్దతు నిస్తున్నట్టు అఫిడవిట్లు కూడా ఉన్నాయని సిబాల్ కోర్టుకు తెలిపారు. మెజార్టీ నిరూపణకు 24 గంటల్లో బలపరీక్ష ఒక్కటే సరైన మార్గమని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. బలపరీక్షలో ఓడిపోయినా సంతోషమేనని కాంగ్రెస్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. 24 గంటల్లో బలపరీక్షకు బీజేపీ తరపు లాయర్ ముకుల్ రోహిత్గీ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు రెండు మూడు రోజుల సమయం కావాలని…24 గంటల్లో బలపరీక్ష అంటే దాని ప్రభావం రేపు కొన్ని రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలపై పడుతుందని చెప్పారు. బల నిరూపణ ఎప్పుడైనా చేసుకోవచ్చని ధర్మాసనం ముందు వాదించారు. ముందు ప్రొటెం స్పీకర్, ఆ తర్వాత స్పీకర్ ను ఎన్నుకున్న తర్వాత బలపరీక్ష నిర్వహించాల్సి ఉంటుందన్నారు. బలపరీక్ష ఎప్పుడు నిర్వహించాలనేది గవర్నర్ నిర్వహిస్తారని అన్నారు.