2002 నాటి అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోడీపై ఇటీవల బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని బ్లాక్ చేస్తు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తు దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, ప్రముఖ జర్నలిస్టు ఎన్.రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. “ఇండియా: ది మోడీ క్వశ్చన్” అనే రెండు భాగాల బీబీసీ సిరీస్‌లో “సమాచారాన్ని స్వీకరించడం, ప్రసారం చేయడం లాంటి వారి హక్కులను అడ్డుకోకుండా కేంద్రాన్ని నిరోధించాలని వారు పిటిషన్‌లో కోరారు.
పత్రికలతో సహా పౌరులందరికీ డాక్యుమెంటరీలోని విషయాలను వీక్షించడానికి, సమాచార అభిప్రాయాన్ని రూపొందించడానికి, విమర్శించడానికి, నివేదించడానికి, చట్టబద్ధంగా ప్రసారం చేయడానికి ప్రాథమిక హక్కు ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో పంచుకున్న సమాచారాన్ని “ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సెన్సార్ చేసే అన్ని ఆదేశాలను రద్దు చేయాలని కూడా అప్పీల్ లో కోరారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేశ్ లో కూడిన ధర్మాసనం వాదనలు విననుంది.