భావ ప్రకటనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం పౌరులతో సమానంగా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వాక్ స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నారని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది.
అలాంటి ప్రజాప్రతినిధుల ప్రాథమిక హక్కులపై అదనపు ఆంక్షలు విధించలేమని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. లైంగికదాడి బాధితురాలిపై యూపీ మంత్రి అజమ్ ఖాన్ వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ పై న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ఏఎస్ బోపన్న, బీఆర్ గవాయి, వి రామసుబ్రమణియన్, బీవీ నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రజాప్రతినిధుల వాక్ స్వతంత్రంపై ఆంక్షలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం నిర్దేశించిన దానికంటే మించి ఉండరాదని వెల్లడించింది. ఒక మంత్రి తన అధికార హోదాలో చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించలేమని ధర్మాసనం పేర్కొంది.
జస్టిస్ బీవీ నాగరత్న మాట్లాడుతూ.. వాక్ స్వతంత్రం, భావప్రకటనా స్వేచ్ఛ చాలా అవసరమైన హక్కులని పేర్కొన్నారు. కానీ ద్వేషపూరిత ప్రసంగంగా మారకూడదని ఆమె అన్నారు. మరోవైపు ప్రభుత్వ పదవులను కలిగి ఉన్న వ్యక్తులు స్వీయ నియంత్రణ విధించుకోవాలని ధర్మాసనం పేర్కొంది.
నేతలు చేసే విద్వేష పూరిత వ్యాఖ్యలపై తాము మార్గదర్శకాలు జారీ చేయలేమని పేర్కొంది. ఈ సమస్యకు పార్లమెంట్ పరిష్కారం చూపాలని చెప్పింది. మంత్రుల విద్వేష పూరిత వ్యాఖ్యలను నియంత్రించాల్సిన బాధ్యత పార్టీలపై ఉందని వెల్లడించింది. అందుకు సంబంధించి ఒక ప్రవర్తన నియమావళి వారే రూపొందించుకోవాలని సూచించింది.
విద్వేషపూరిత వ్యాఖ్యలతో పౌరులకు ఇబ్బందులు తలెత్తినప్పుడు సివిల్ కోర్టులను ఆశ్రయించవచ్చని వివరించింది. నేతలు చేసే విద్వేషపూరిత ప్రసంగాలు రాజ్యాంగంలో చెప్పిన సోదర భావం, స్వేచ్ఛ, సమానత్వానికి పెద్ద దెబ్బ అని పేర్కొంది . సమాజంలో ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మరొక పౌరుడిపై ఉందని వ్యాఖ్యానించింది.