మైనార్టీ సంస్థల్లో నియామకాలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. మైనార్టీ విద్యాసంస్థలైన మదర్సాల్లో టీచర్ల నియామకాలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ మదర్సా సర్వీస్ కమిషన్ యాక్ట్ -2008 సరైనదే నని సుప్రీంకోర్టు సమర్ధించింది.
మదర్సాల్లో ఖాళీగా ఉన్న టీచర్ల నియామకాలకు సంబంధించి 2008 లో పశ్చిమ బెంగాల్ మదర్సా సర్వీస్ కమిషన్ యాక్ట్ -2008 ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ కొన్ని మదర్సాల యాజమాన్యాలు తప్పుబట్టాయి. దీని రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ హైకోర్టు నాశ్రయించారు. దీనిపై విచారించిన పశ్చిమ బెంగాల్ హైకోర్ట్ ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. ఈ చట్టం ఆర్టికల్ 30 ని ఉల్లంఘించినట్టు పేర్కొంది. మదర్సాల్లో టీచర్లన నియమించుకునే హక్కు యాజమాన్యాల ఇష్టం మేరకే ఉంటుందని తెలిపింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కొత్తగా నియమితులైన టీచర్లు సుప్రీంకోర్టు నాశ్రయించారు. తుది తీర్పు వచ్చేంత వరకు కొత్తగా నియమితులైన టీచర్లను తొలగించవద్దంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విషయం కోర్టు విచారణలో ఉన్నందున ఖాళీగా ఉన్న 2,600 టీచర్ పోస్టులను భర్తీ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీనిపై తాజాగా తీర్పునిస్తూ ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థలు, మైనార్టీ సంస్థల్లో ఉద్యోగాల నియమకాలు చేపట్టే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పింది.