మధ్యప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న ఓ జూనియర్ లేడీ ఆఫీసర్‌కు ఓ మాజీ జడ్జి వాట్సాప్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లను పంపించడంపై సుప్రీం కోర్టు తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ విషయాన్ని ఎంత మాత్రం సహించేది లేదని వ్యాఖ్యానించింది. మధ్యప్రదేశ్ హైకోర్టులో సదరు మాజీ జడ్జిపై నమోదైన లైంగిక వేధింపుల కేసు విషయమై పిటిషనర్ వాదనలను విన్న సుప్రీం కోర్టు పై విధంగా వ్యాఖ్యలు చేసింది.
సుప్రీం కోర్టులో ఆ మాజీ జడ్జి వేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పై విధంగా వ్యాఖ్యలు చేయగా.. అంతకు ముందు మధ్యప్రదేశ్ హైకోర్టు తరఫున సీనియర్ న్యాయవాది రవీంద్ర శ్రీవాత్సవ తన వాదనలు వినిపించారు. ఆ మాజీ జడ్జి సదరు లేడీ ఆఫీసర్‌కు పంపిన అసభ్యకరమైన వాట్సాప్ మెసేజ్‌లను రవీంద్ర చదివి వినిపించారు. దీంతో చీఫ్ జస్టిస్ బాబ్డే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జడ్జి స్థాయిలో ఉన్న వ్యక్తి తన జూనియర్ ఆఫీసర్‌తో ప్రవర్తించిన తీరును సహించేది లేదన్నారు.
కాగా ఆ లేడీ ఆఫీసర్ కేసును కొనసాగించేందుకు ఇష్ట పడడం లేదని, కోర్టు బయట వివాదాన్ని సెటిల్ చేసుకునేందుకు యత్నిస్తుందని రవీంద్ర తెలిపారు. ఈ క్రమంలో పిటిషనర్ తరఫు న్యాయవాది ఆర్.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆ మహిళ ఆ మాజీ జడ్జిపై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుందని, కానీ హైకోర్టు మాత్రం తన క్లయింట్ పట్ల చర్యలు తీసుకునేందుకు పూనుకుందని తెలిపారు.
అయితే ఇందుకు స్పందించిన చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా ? హైకోర్టు చర్యలను ఆపే హక్కు ఎవరికి ఉంది ? మహిళ పట్ల అలా ప్రవర్తించడం సరి కాదు కదా. కనుక కేసు విచారణ కొనసాగుతుంది.. అని అన్నారు. ఈ క్రమంలో ఈ కేసులో విచారణను సుప్రీం కోర్టు వారం వరకు వాయిదా వేసింది. ఇక ఆ మాజీ జడ్జిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఉత్కంఠను కలిగిస్తోంది.