కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాలు చూపిన కరోనా మరణాల లెక్కలకు.. వచ్చిన దరఖాస్తులకు పొంతన లేదు. దీంతో పరిహారం కోసం వచ్చిన నకిలీ దరఖాస్తులపై దర్యాప్తు జరిపేందుకు సుప్రీం కోర్టును కేంద్రం గడువు కోరింది. ఈ క్రమంలో కరోనా మృతుల పరిహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ దరఖాస్తులపై దర్యాప్తు జరిపేందుకు ధర్మాసనం కేంద్రానికి అనుమతినిచ్చింది.
మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదైన కరోనా మరణాల సంఖ్య.. పరిహారం కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్యకు చాలా వ్యత్యాసం ఉంది. కావున ఆయా రాష్ట్రాల్లో ఐదు శాతం దరఖాస్తులపై దర్యాప్తు చేసే వెసులుబాటును సుప్రీం కేంద్రానికి కల్పించింది.
మృతుల కుటుంబీకులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకునే కాల వ్యవధిని 30 రోజులే ఇవ్వాలనే కేంద్రం అభ్యర్థనపై కూడా సుప్రీం స్పందించింది. కరోనా కారణంగా మరణానికి పరిహారం క్లెయిమ్ చేయడానికి కోర్టు మార్చి 28 వరకు 60 రోజులు నిర్ణయించింది. భవిష్యత్లో సంభవించే కరోనా మరణాల విషయంలో ఆ వ్యవధిని 90 రోజులుగా పేర్కొంది.
కరోనా మృతుల కుటుంబాలకు రూ.50,000 పరిహారం చెల్లింపులో అవకతవకలపై సుప్రీంకోర్టు గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు అనైతికమైనవని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. పరిహారం చెల్లింపు పారదర్శకంగా జరగడానికి అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించింది.