ఎట్టకేలకు కార్పొరేట్ కాలుష్యం పై ఉక్కుపాదం మోపిన రైతులకు న్యాయం దక్కబోతుంది. దివిస్ ల్యాబ్స్ పై రెండేళ్లుగా ఉన్న స్టేను సుప్రీం కోర్టు రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. అంతే కాదు జరిగిన పర్యావరణ విధ్వంసం పై న్యాయం చేయాలని.. కాలుష్యంతో చౌటుప్పల్,చిట్యాల, మునుగోడు, నారాయణ పూర్ మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలపై వెంటనే విచారణ చేపట్టాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ను ధర్మాసనం ఆదేశించినట్లు సమాచారం.
అయితే దివిస్ ల్యాబ్ సృష్టిస్తున్న కాలుష్యంపై చౌటుప్పల్ కు చెందిన రైతులు,గీత కార్మికులు కలిసి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయడం జరిగింది. దానిపై దివిస్ ల్యాబ్స్, శ్రీని పరిశ్రమ యాజమాన్యాలు విచారణ నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే విధించడం జరిగింది. దీంతో గత రెండేళ్లుగా స్టే ఎత్తివేయాలని పిటిషన్ దారుల తరపు న్యాయవాది కోరుతున్నారు. అయితే సోమవారం నాడు దివిస్ ల్యాబ్స్ ఫార్మా పరిశ్రమలకు సంబంధించిన కేసు పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.
తప్పని సరిగా స్టే రద్దు చేస్తే..జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చేత విచారణ జరిగి, బాధితులకు న్యాయం జరుగుతుందని బాధితుల తరపు న్యాయవాది కోరారు. కాగా మంగళవారం నాడు దివిస్ ల్యాబ్స్ పై సుప్రీం కోర్టులో స్టే రద్దు చేసినట్లు తెలిసింది. దీంతో పాటు ఎన్ జీ టీ విచారణ జరపాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అయితే స్టే ఎత్తివేయడంతో.. ఇప్పుడు గత ఇరవై ఏళ్లుగా దివిస్ ల్యాబ్స్ సృష్టించిన కాలుష్య విధ్వంసం తెర పైకి వస్తుందని.. ఉపాధి కోల్పోయిన రైతులు, గీత కార్మికులంటున్నారు.
అదే విధంగా తీవ్ర కాలుష్యంతో పర్యావరణానికి కల్గిన హానీని తగ్గించడానికి నిధులు కూడా అదే సంస్థ నుంచి వసూలు చేయొచ్చని బాధితులు చెబుతున్నారు.అయితే మొత్తంగా చూసుకుంటే దివిస్ ల్యాబ్స్ కు 500 కోట్ల నష్టపరిహారం భరించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇలా ఉంటే.. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పూర్తిగా అవినీతిమయమైపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఇరవై ఏళ్లుగా దివిస్ ల్యాబ్స్ కాలుష్యంతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నా.. ఏమాత్రం పట్టనట్టగా చూస్తూ ఉంది. అంతే కాదు ఈ బోర్డులోని అధికారులు దివిస్ సంస్థకు కోవర్టులుగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.