ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీబీఐ, ఇతర ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. గత విచారణ సందర్బంగా ఈ కేసులో సీబీఐ విచారణ ఆపేయాలని ఆదేశాలు ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే తెలిపారు. కానీ ఆ మేరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు.
ఈ కేసుపై హైకోర్టులో కేంద్రం, సీబీఐ తరఫున ఎవరూ హాజరు కాలేదని దవే తెలిపారు. ఆయన వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం మినహా సీబీఐ, ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జులై 31వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ విచారణపై స్టే ఇవ్వాలంటూ కోరుతూ ఇటీవల తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీనిపై వేసవి సెలవుల తర్వాత జులై 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో మిస్ లేనియస్ పిటిషన్ కింద విచారణ జరుపుతామని న్యాయస్థానం వెల్లడించింది.
అప్పటి వరకు ఈ కేసులో స్టేటస్ కో కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తును సిట్ కు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. కానీ ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణల నేపథ్యంలో సిట్ దర్యాప్తును హైకోర్టు రద్దు చేసింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.
ఈ తీర్పును డివిజన్ బెంచ్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపై స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వం కోరింది. క్రిమినల్ కేసులకు సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులను విచారించే పరిధి ధర్మాసనానికి ఉండదని హైకోర్టు వెల్లడించింది. కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్ల వచ్చని సూచించడంతో తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టింది.