మాస్కు ధరించని వారు కొవిడ్-19 కేర్ సెంటర్స్‌లో పనిచేసేలా గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్న గుజరాత్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ సుభాశ్ రెడ్డి, జస్టిస్ ఎమ్.ఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. గుజరాత్ హైకోర్టు అత్యంత కఠిన ఆదేశాలిచ్చిందని తెలిపింది.
రాష్ట్రంలో కరోనా నిబంధనలను ప్రజలు ఉల్లంఘిస్తున్నారనే విషయంపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ప్రకారం ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం నియమాలను తప్పనిసరిగా పాటించేలా చేయాలని రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.