వివాదాస్పదమైన మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న ఉద్యమం, నిరసనలపై దాఖలైన పిటిషన్లపై విచారణను వాయిదా వేస్తూ… ఈ పిటిషన్లపై వెకేషన్ బెంచ్ విచారణ జరుపుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే చెప్పారు. రైతు సంఘాలు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఎటువంటి ఆదేశాలను జారీ చేయలేదు.
వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును నిలిపేయడానికి అవకాశాలను పరిశీలించాలని జస్టిస్ బాబ్డే సూచించారు. కానీ ప్రభుత్వం మాత్రం అందుకు అవకాశం లేదని చెప్పింది. ఆ మూడు చట్టాల అమలుపై స్టే ఇవ్వలేమని చెబుతూనే… తదుపరి విచారణ పూర్తయ్యే వరకు చట్టాల అమలు నిలిపివేయాలని సూచించింది.
ఢిల్లీ సరిహద్దుల్లో మూడు వారాల నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రైతులను రహదారులపై నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది.