పంజాబ్ లో ప్రధాని మోడీ పర్యటనపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పర్యటనకు సంబంధించి అన్ని రికార్డులను భద్రపరచాలని పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు ఆదేశించింది. పీఎం పర్యటనలో భద్రతా లోపాలపై వస్తున్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్ ను శుక్రవారం విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రధాని ప్రయాణ వివరాలు, ఏర్పాట్ల సమాచారాన్ని వెంటనే భద్రపరచాలని ఆదేశించింది. దర్యాప్తు కోసం కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు జరుపుతున్న విచారణను సోమవారం వరకు నిలిపివేయాలని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పిటిషన్ వేసిన సీనియర్ అడ్వకేట్ మనిందర్ సింగ్ వాదనలను వినిపించారు. ఇది శాంతిభద్రతల అంశానికి మాత్రమే సంబంధించిన విషయం కాదని ఎస్పీజీ చట్టం పరిధిలోకి వస్తుందని కోర్టుకు వివరించారు. ఎస్పీజీ సూచనల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా స్థానిక ప్రభుత్వాలలో కూడా అధికారులు విధులు నిర్వహిస్తారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకోవడానికి లేదని.. ఉన్నతస్థాయి కమిటీ వేసి దర్యాప్తు చేయాలని కోరారు.
కేంద్రం తరుపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇది చాలా అరుదైన ఘటన అని అన్నారు. ప్రధాని పర్యటనలో భద్రతా లోపం సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించినదని ఆయన అభిప్రాయాన్ని కోర్టు ముందుంచారు. భద్రతాలోపంపై జరగనున్న విచారణకు ఎన్ఐఏ కూడా సహకరిస్తుందని తుషార్ మెహతా తెలిపారు. ఈ సంఘటనపై తాము చాలా సీరియస్ గా ఉన్నామని పంజాబ్ ప్రభుత్వం కోర్టులో వివరణ ఇచ్చింది. ఇప్పటికే విచారణకు స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.