గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ లో స్వామి నారాయణ ట్రస్ట్ కు చెందిన శివానంద గర్ల్స్ కాలేజీలో విద్యార్ధులందరిని వాష్ రూమ్ లో నగ్నంగా నిలబెట్టి రుతుస్రావాన్నిచెక్ చేసిన సంఘటన మర్చిపోక ముందే అదే రాష్ట్రంలో అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.
సూరత్ మున్సిపల్ కార్పోరేషన్ లో 10 మంది మహిళలు ట్రెయినీ క్లర్క్ లుగా నియమితులయ్యారు. మూడు సంవత్సరాల ట్రెయినింగ్ పూర్తయ్యాక వారిని ఫర్మినెంట్ చేసే ముందు ఫిజికల్ టెస్ట్ చేయడం తప్పనిసరి. వారిలో ఎవరైనా గర్భం ధరించారా? ఇతర ఆరోగ్య సంబంధ సమస్యలున్నాయా అని పరీక్షిస్తారు. దానిలో భాగంగా సూరత్ లోని ఎస్.ఎం.ఐ.ఎం.ఇ.ఆర్ హాస్పిటల్లో ఆ మహిళా ఉద్యోగినులందరికి ఫిజికల్ టెస్ట్ నిర్వహించారు. ఈ ఫిజికల్ టెస్ట్ లో ఉద్యోగులందరిని ఒకే చోట నగ్నంగా నిలబెట్టి టెస్ట్ చేశారు.
ఈ ఫిజికల్ టెస్ట్ ను మహిళా డాక్టర్లే నిర్వహించినప్పటికీ అందరినీ ఒకే సారి నగ్నంగా నిలబెట్టి టెస్ట్ చేయడంపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఒక్కొక్కరిని రూమ్ లోకి పిలిచి టెస్ట్ చేయాల్సింది పోయి అందరిని ఒకేసారి నగ్నంగా నిలబెట్టి టెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెళ్లి కాని మహిళా ఉద్యోగులకు సైతం ప్రిగ్నెన్సీ టెస్ట్ లు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఫిజికల్ టెస్ట్ కు వ్యతిరేకం కాదని..అయితే ఈ విధమైన చర్య చట్ట వ్యతిరేకం…అమానవీయమైనదని మున్సిపల్ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. మీరు గతంలో గర్భం ధరించారా అంటూ మహిళా డాక్టర్లు ఉద్యోగినులను అసహ్యమైన ప్రశ్నలతో వేధించారని ఉద్యోగం సంఘం నాయకులు తెలిపారు.
ఇలాంటి చర్యలు సరైనవి కావని.. ఈ రకంగా టెస్ట్ లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ జగదీష్ పటేల్ అన్నారు. సూరత్ మున్సిపల్ కమిషనర్ బంచనిధి పణి సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.