సర్జికల్ స్ట్రైక్స్ అని వినడమే కానీ సామాన్య జనం దాన్ని చూసింది లేదు. శత్రువుని ఉక్కిరిబిక్కిరి చేసే ఆ వ్యూహం ఎలా ఉంటుందో కళ్లారా చూడాలని కోరుకోనివారే ఉండరు. అత్యంత రహస్యంగా పరాయిదేశంపై చేసే ఆపరేషన్ కాబట్టి దాన్ని చూసే అవకాశం ఎవరికీ ఉండదు కానీ.. రాజకీయాల్లో సర్జికల్ స్ట్రైక్స్‌ను చేసే చాన్స్ మాత్రం తెలంగాణ ప్రజలకు రాబోతోంది. సెప్టెంబర్ 17 అందుకు వేదిక కాబోతోంది.
100 ప్లస్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న కారు పార్టీకి.. ఇటీవల జంక్షన్ జామ్‌లు తప్పడం లేదు. ఆగి, ఆగి ముందుకు సాగడమే తప్ప.. తప్పించుకోవడం కుదరడం లేదు. ఒకటి కాకుంటే ఒకటి.. బీజేపీ, కాంగ్రెస్ పోటీపడి మరీ టీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతున్నాయి. ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను షురూ చేసింది మొదలు.. కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. మొన్నటి వరకు అక్కడా, ఇక్కడా సభలు పెట్టిన ఆయన.. ఇప్పుడు ఏకంగా సీఎం ఇలాఖా గజ్వేల్‌లోకి అడుగుపెట్టి తొడగొట్టాలని చూస్తున్నారు. పైగా ఏడేళ్లుగా ఏటా టీఆర్ఎస్‌ను డిఫెన్స్‌లోకి నెడుతున్న సెప్టెంబర్ 17వ తేదీనే అందుకు ముహూర్తంగా పెట్టుకున్నారు. గజ్వేల్‌లోకి రేవంత్ రెడ్డిని అడుగుపెట్టనీయబోమంటూ ఓ వైపు టీఆర్ఎస్ నేతలు.. అడ్డం వచ్చివారిని తొక్కుకుంటూ వెళ్లితీరతానని మరోవైపు రేవంత్ రెడ్డి ఇప్పటికే పరస్పరం సవాళ్లు విసరుకున్నందున.. ఆరోజు ఏం జరగబోతోందన్నది ఇప్పటి నుంచే ఉత్కంఠ రేపుతోంది. రేవంత్ రెడ్డి సభను కేసీఆర్ సజావుగా జరగనిస్తారా లేక ఏదో ఒక రూపంలో బ్రేక్ వేస్తారా అన్న చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డి గజ్వేల్ సభ చాలదన్నట్టు.. మరోవైపు బీజేపీ కూడా కేసీఆర్‌పై అదే రోజు యుద్ధాన్ని ప్రకటించింది. ఆల్‌రెడీ చార్మినార్ నుంచి ప్రజా సంగ్రామ యాత్రను మొదలుపెట్టిన బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఇప్పటికే కారును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నట్టుండి గేర్ మార్చి, ఏకంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షానే తెలంగాణకు తీసుకురాబోతున్నారు. సెప్టెంబర్ 17 తేదీనే నిర్మల్ వేదికగా బహిరం సభ నిర్వహించబోతున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడంపై కేసీఆర్‌ను మరోసారి ఇరుకున పెట్టేందుకు పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇలా ఒకే రోజున అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్.. భారీ సభలకు ప్లాన్ చేస్తుండటంతో టీఆర్ఎస్‌కు ఏం చేయాలన్నది ఇప్పుడు అంతుబట్టడం లేదు. ఆ సభలు జరిగితే పార్టీకి మరింత నష్టమే కాబట్టి… వాటి నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ కొత్త అస్త్రాన్ని ఏదైనా ప్రయోగిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
సాధారణంగా బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ఏవైనా సభలు నిర్వహించాలని చూస్తే… ఏదో ఒక కారణంతో తొలుత అవి జరగకుండా చేసే ప్రయత్నం చేస్తారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఒకవేళ అది కుదరకపోతే అలాంటి కార్యక్రమాల జరిగే సమయానికి సరిగ్గా ఒక్క రోజు ముందు రోజు ఏదో ఒక సంచలనాన్ని తెరపైకి తెచ్చి జనాన్ని, మీడియాని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో కేసీఆర్ ఈసారి ఏం చేస్తారు.. సైలెంట్‌గా ఉండిపోతారా.. లేక ఏదైనా సెన్సేషన్‌ను ప్లాన్ చేసి ఉంటారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.