సరోగసీ నియంత్రణ బిల్లు-2019 లో భారీ మార్పులకు పార్లమెంటరీ కమిటీ సూచించింది. సరోగేట్ (అద్దె గర్భం ఇచ్చే మహిళ) సొంత బంధువే కావాల్సిన అవసరం లేదని..ఏ మహిళైనా తనకు ఇష్టముంటే అనుమతించాలని కమిటీ సూచనలు చేసింది. సరోగసీ బిల్లు-2019 కు 23 సభ్యుల రాజ్యసభ సెలెక్ట కమిటీ 15 భారీ మార్పులు సూచించింది. దంపతులు ఎలాంటి గర్భ నిరోధకాలు లేకుండా ఐదేళ్లు సెక్స్ లో పాల్గొన్నప్పటికీ గర్భం ధరించకపోతే దాన్ని అసమర్ధతగా పేర్కొనే ”ఇన్‌ఫెర్టిలిటీ” నిర్వచనాన్ని తొలగించాలని సూచించింది.
అంతే కాదు..35 నుంచి 45 ఏళ్ల వయసున్న విధవరాలు లేదా విడాకులు తీసుకున్న ”సింగిల్ ఇండియన్ వుమెన్” కూడా సరోగసీని ఉపయోగించుకోవడానికి అనుమతివ్వాలని సలహా ఇచ్చింది. సరోగేట్ (అద్దె గర్భం ధరించిన మహిళ) మదర్ ఇన్సూరెన్స్ ను కూడా 16 నెలల నుంచి 36 నెలలకు పొడిగించాలని సిఫార్స్ చేసింది. సరోగసీ బిల్లు-2019 ఇంకా రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. 2019 నవంబర్ 21 న బిల్లును రాజ్యసభకు పంపినప్పటి నుంచి రాజ్యసభ సభ్యుల కమిటీ 10 సార్లు సమావేశమై ఈ సూచనలు చేసింది. కమిటీ ఛైర్మన్ భూపేందర్ యాదవ్ దీనిపై బుధవారం నివేదికను సమర్పించారు.