తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలేమో ఎండ దంచేస్తోంది. రాత్రైతే చలి వణికిస్తోంది. ఫిబ్రవరిలోనే.. సమ్మర్ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పగటి పూట 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు.. రాత్రి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ ఉష్ణోగ్రతల్లో అత్యధిక హెచ్చుతగ్గులతో..జనం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో గత నాలుగు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. చలి వణికిస్తోంది. దీంతో రాష్ట్రంలోనే అత్యల్పంగా అల్లూరి జిల్లా కుంతలంలో 7.5, జీకే వీధిలో 7.7, చింతపల్లిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా కట్టకిందపల్లి, గంగవరంలో 10 డిగ్రీలుగా ఉంది.
ఇక శ్రీ సత్యసాయి,తిరుపతి, అన్నయమ్య జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 12 డిగ్రీల్లోపు ఉంటున్నాయి. రాత్రి 10 గంటల తర్వాత పెరుగుతున్న చల్లి తీవ్రత.. ఉదయం వరకూ కొనసాగుతోంది. అటు తెలంగాణలోనూ.. రాత్రి సమయంలో చలి పంజా విరుసుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కొమురం భీమ్ జిల్లా సర్పూర్ లో 7.1, మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ లో 7.9, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో 8.9, నిర్మల్ జిల్లా జామ్ లో 10.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మరో వైపు ఏపీలో నాలుగైదు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలకు పైగా పెరిగాయి. పగటి పూట 38 డిగ్రీలు నమోదవుతుండడంతో.. ఫిబ్రవరిలోనే ఎండాకాలం తలపిస్తోంది.