వాహనాల పెండింగ్ చలాన్లపై రాయితీ ఆఫర్ ప్రారంభమైనప్పటి నుంచి.. ఈ-చలాన్ వెబ్ సైట్ ద్వారా పెద్దసంఖ్యలో వాహనదారులు రుసుములు చెల్లిస్తున్నారు. ఈ ఆఫర్ ను వినియోగించుకునేందుకు వాహనదారులు పోటీపడుతున్నారు.
చలాన్ల చెల్లింపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావటంతో.. ఒక్కసారిగా అధికసంఖ్యలో వెబ్ సైట్ ను తెరవడంతో.. సర్వర్ లపై భారం పడి సాంకేతిక సమస్య తలెత్తింది. ఉన్నట్టుండి సర్వర్లు హ్యాంగ్ అయ్యాయి. దీంతో వెబ్ సైట్ ఓపెన్ కావడం లేదని వాహనదారులు చెప్తున్నారు.
పేమెంట్ గేట్ వే వద్ద ఎక్కువగా సమస్య వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ నెల 31 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.
వెబ్ సైట్ లోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు. నెల రోజుల సమయం ఉంది కాబట్టి.. సమయానుకూలంగా జరిమానా చెల్లించాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే.. అప్పటి వరకు ఇలాగే సర్వర్ బిజీ వస్తే సమస్యగా మారుతుందనే అపోహలు ఉన్నాయంటున్నారు వాహనదారులు.