కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల మూడో టీఎంసీ కాలువలకోసం భూసేకరణ ప్రక్రియ ఇంకా ఆగలేదు. ఆ భూమి మీద ఆధారపడి బతుకుతున్న రైతులు.. తమ భూమిని ఇవ్వడానికి ససేమిరా అన్నప్పటికీ అధికారులు మాత్రం తమ ఇష్టానుసారంగా ముందుకు పోతున్నారు. తమ భూమి కాలువ నిర్మాణంలో పోతే తమకు చావే శరణ్యం అంటున్నారు బాధితులు.
సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ వద్ద డ్రోన్ కెమెరాలతో అధికారులు సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న నిర్వాసితులు పొలం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. మందు డబ్బాలు చేతపట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
గత 25 రోజులుగా ఆందోళన చేస్తున్నారు నిర్వాసితులు. అయితే.. అధికారులు డ్రోన్ కెమెరాలను వినియోగించి సర్వేకు యత్నించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులకు, రైతులకు తీవ్రమైన వాగ్వాదం జరిగింది.
అధికారులు ఎంత సర్దిచెప్పినా కూడా సర్వే చేసేందుకు రైతులు ఒప్పుకోలేదు. చేసేదేంలేక అధికారులు గ్రామసభ నిర్వహిస్తామని ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.