ఓటీటీలో పెద్ద హిట్టయిన ఆకాశం నీ హద్దురా సినిమా ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా రీమేక్ లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా హీరో సూర్య ప్రకటించాడు. ఇక్కడ సూర్య ఈ రీమేక్ ప్రాజెక్టును ఎనౌన్స్ చేయడం వెనక ఓ రీజన్ ఉంది.
తెలుగు, తమిళ భాషల్లో ఆకాశం నీ హద్దురా సినిమాను సూర్య నిర్మించాడు. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అక్షయ్ కుమార్ సినిమాను సూర్యనే నిర్మించబోతున్నాడు. అలా తన సూపర్ హిట్ సినిమా రీమేక్ తో బాలీవుడ్ లో నిర్మాతగా అడుగుపెడుతున్నాడు సూర్య. ఈ హీరో బ్యానర్ పేరు 2డీ ఎంటర్ టైన్ మెంట్స్.
కెప్టెన్ గోపీనాధ్ జీవితచరిత్ర ఆధారంగా రాసిన సింప్లీ ఫ్లై అనే పుస్తకాన్ని ఆకాశం నీ హద్దురా సినిమాగా తెరకెక్కించారు. సుధా కొంగర ఈ సినిమాను డైరక్ట్ చేశారు. దేశ విమానయాన రంగాన్ని ఓ మలుపు తిప్పిన ఎయిర్ డెక్కన్ ప్రస్థానం ఈ సినిమాలో కనిపిస్తుంది. మధ్యతరగతి వ్యక్తికి కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనేది గోపీనాధ్ కల. దాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.
అప్పటి కరోనా పరిస్థితుల వల్ల ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయలేకపోయారు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. అలా ఓటీటీలో వచ్చినప్పటికీ అనూహ్య స్పందన రాబట్టింది సూర్య సినిమా. ఇప్పుడీ మూవీని అక్షయ్ కుమార్ హిందీలో చేస్తున్నాడు. ఈసారి థియేటర్లలోనే రిలీజ్ అవుతుంది.