మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓ సభలో అసహనానికి లోనయ్యారు. అడిగిన వెంటనే ఓ పనిని చేస్తానని హామీ ఇచ్చినా.. సభకు వచ్చిన జనం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో షాక్ తిన్నారు. “చప్పట్లు కూడా కొట్టరా దీనిక్కూడా.. కథ వింటున్నట్టు వింటున్నరు.. చప్పట్లు కూడా కొడుతలేరు..” అని అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి నోటి నుంచి అలాంటి మాటలు విన్న కొందరు ఆశ్చర్యపోయి నవ్వుకుంటే.. మరికొందరు వెంటనే తేరుకుని చప్పట్లు కొట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్, గొల్లపల్లి ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..” మోడల్ రైతు బజార్ కావాలని కోరుతున్నారు. ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, గొల్లపల్లి మధ్య కడితే మేలు అంటున్నారు. తప్పకుండా కట్టిచ్చే బాధ్యత నాది..” అని హామీ ఇచ్చినా గట్టి స్పందన రాకపోవడంతో మంత్రి కేటీఆర్ ఈ కామెంట్లు చేశారు.