నిత్యం ఏదో ఒక వివాదంలో టీఆర్‌ఎస్ నేతల పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. బెదిరించారనో.. కబ్జా చేశారనో ఇలా ఏదో ఇష్యూ తెరపైకి వస్తూనే ఉంటుంది. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి వ్యవహారం ఒకటి బయటకొచ్చింది. ఆయనతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది సూర్యాపేటకు చెందిన ఓ కుటుంబం.
బాధిత కుటుంబం చెప్తున్న దాని ప్రకారం… సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీకి మండలాధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతనిపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టారు. పీడీ యాక్ట్ కింద జైలుపాలు చేశారు. అయితే.. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా జగదీశ్వర్ రెడ్డి అనుచరులు వదల్లేదు.
ఎల్లయ్యపై జగదీశ్వర్ రెడ్డి అనుచరులు హత్యాయత్నం చేశారు. సూర్యాపేట ఎస్పీ, డీఎస్పీ కూడా మంత్రి ఆదేశాల మేరకు హత్యాయత్నం జరిగినా పట్టించుకోలేదు. ఎల్లయ్యపైనే అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరనందుకే.. రాజకీయ కక్షతో మంత్రి తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఎల్లయ్య భార్య అంటోంది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీని కోరింది.
మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆయన అనుచరుడు వట్టే జానయ్య, జిల్లా ఎస్పీ, డీఎస్పీ ల నుండి రక్షణ కల్పించాలని హెచ్చార్సీని వేడుకుంది బాధిత కుటుంబం. గత నెలలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెదురు బావి తండాకు చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యుడు మాతృనాయక్ ను కూడా అధికార పార్టీ నేతలు ఇలాగే పోలీసులతో వేధించారు. ఆ సమయంలో అతను స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. అప్పట్లో అది కలకలం రేగగా.. ఇప్పుడు సూర్యాపేటలో ఎల్లయ్య ఘటన వెలుగుచూసింది.