ఓటీటీ స్పేస్ లోకి మరో అక్కినేని నటవారసుడు ఎంటరయ్యాడు. సుశాంత్ ఓటీటీ డెబ్యూ ఇచ్చాడు. జీ5 యాప్ లో స్ట్రీమింగ్ కు రాబోతున్న ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు సుశాంత్. ఈ విషయాన్ని ఈరోజు జీ5 గ్రూప్ సగర్వంగా ప్రకటించింది.
నాగశౌర్యతో వరుడు కావలెను అనే సినిమా తీసి ఫ్లాప్ అందుకున్న దర్శకురాలు లక్ష్మీసౌజన్య. ఈ డైరక్టర్, తన రెండో ప్రయత్నంగా మరో సినిమా చేయలేదు. వెబ్ సిరీస్ ను ఎంచుకుంది. ఈ వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్ర కోసం సుశాంత్ ను తీసుకున్నారు. క్యారెక్టర్ నచ్చడంతో సుశాంత్ కూడా ఓకే చెప్పేశాడు.
ఇంకా పేరు పెట్టని ఈ వెబ్ సిరీస్ లో పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు సుశాంత్. దీనికి సంబంధించి లుక్ కూడా రివీలైంది. ఇందులో గడ్డం, మీసం పెంచి మఫ్టీ లుక్ లో బాగున్నాడు సుశాంత్. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ టైటిల్, అందులో సుశాంత్ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాల్ని వెల్లడించబోతున్నారు.
కొన్నాళ్లుగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు సుశాంత్. అతడి మార్కెట్ పూర్తిగా పడిపోయింది. అల వైకుంఠపురములో అతడు పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది కానీ క్రేజ్ మాత్రం రాలేదు. ఆ సినిమా సక్సెస్ తర్వాత సోలో హీరోగా ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమా చేస్తే, కనీసం రెంట్ ఖర్చులు కూడా రాలేదు.
అలా పూర్తిగా థియేట్రికల్ మార్కెట్ పోగొట్టుకున్న సుశాంత్, ఇప్పుడు ఓటీటీలోకి ఎంటరయ్యాడు. అక్కినేని కాంపౌండ్ నుంచి నాగచైతన్య ఇప్పటికే ఓటీటీలో ఓ వెబ్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే.