సీనియర్ ఐ.పి.ఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజ్స్ మాజీ చీఫ్, ఏబీ వెంకటేశ్వర రావు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ పిటిషన్ లో కోరారు. గత ఏడాది మే 31 నుంచి తనకు వేతనం చెల్లించడం లేదంటూ వెంకటేశ్వరరావు పిటిషన్ లో పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలతో…రాజకీయ ఒత్తిళ్లతో జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని వెంకటేశ్వరరావు క్యాట్ ను కోరారు.
సీనియర్ ఐపీఎస్ అధికారియైన ఏబీ వెంకటేశ్వరరావును అదనపు డీజీగా పనిచేసినప్పుడు భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో వై.ఎస్. జగన్ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ నుంచి ఈ నెల 7 న అందిన నివేదిక ఆధారంగా వెంకటేశ్వర్ రావుపై చర్యలు తీసుకుంటున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది. సస్పెన్షన్ కాలంలో ఆయన ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని వెంకటేశ్వరరావను ప్రభుత్వం ఆదేశించింది.