జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆ మేరకు శనివారం రాత్రి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గణపురం మండల కేంద్రానికి చెందిన పెండ్యాల ప్రశాంత్ అనే యువకుడి మరణానికి సంబంధించి ఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి వెల్లడించారు.
ఓ కేసు విషయలో ప్రశాంత్ అనే యువకుడిని ఎస్సై చిత్రహింసలకు గురిచేశాడని.. అందుకు గానూ ప్రశాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బాధితుని తల్లిదండ్రులు భూపాలపల్లి ఎస్పీకి గత వారం ఫిర్యాదు చేశారు. వారం రోజులుగా హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు ప్రశాంత్.
తమ కుమారుడి మరణానికి స్థానిక ఎస్సై ఉదయ్ కిరణ్ తో పాటు మరో వ్యక్తి కారణం అంటూ.. బాధితుని తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
విచారణ పూర్తయ్యే వరకు ఎస్ఐ ఉదయ్ కిరణ్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు నార్త్ జోన్ అడిషనల్ డీఐజీ నాగిరెడ్డి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.