భూ వివాదంలో తలదూర్చి బెదిరింపులకు పాల్పడిన ఓ ఎస్సై ని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసి అధికారులు విచారణ జరుపుతున్నారు. త్వరలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడనున్నట్టు తెలిసింది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల ఎస్సై శ్రీనివాస్ భూ వివాదంలో ఇరుక్కున్నారు. నరసింహులు అనే వ్యక్తిని భూ కొనుగోలు, విక్రయ కేసులో భయభ్రాంతులకు గురి చేశారన్న ఫిర్యాదు జిల్లా పోలీస్ ఉన్నతాదికారులకు అందాయి. దీంతో ఎస్ఐ శ్రీనివాస్ పై పోలీస్ శాఖ విచారణ చేపట్టింది.
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని సర్వే నంబర్లు 573, 570 , 575, 619, 620 621 లలో 16 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి రాయచూర్ జిల్లా శ్రీనగర్ క్యాంపు ప్రాంతానికి చెందిన వెంకటనారాయణ కు చెందినది. ఈ 16 ఎకరాల భూమి గట్టు ప్రాంతంలో ఉండటంతో… వెంకటనారాయణ పొలంలోని 8 ఎకరాల 20 గుంటల భూమిని 2018 సంవత్సరంలో గట్టు మండలం కు చెందిన సరోజమ్మ , వీరేష్ లక్ష్మి లు కొనుగోలు చేశారు. మిగతా భూమి వెంకటనారాయణే ఉంచుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సరోజమ్మ, వీరేష్ లక్ష్మి మిగతా భూమి కూడా తమకే అమ్మాలని భూ యజమాని వెంకటనారాయణ ను కలిశారు. మిగతా భూమి కూడా మీకే విక్రయిస్తానని వెంకటనారాయణ వారికి హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో భూ విక్రయాలు కొనసాగించే ఇద్దరు ఏజెంట్లు గట్టు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ని కలిసి వెంకటనారాయణ భూమి తక్కువ రేటుకు ఇప్పిస్తామని, మీరు కొనుగోలు చెయ్యాలని చెప్పడంతో ఎస్సై శ్రీనివాస్ ఆ భూమిని తన మామ పేరు మీద భూమి కొనుగోలు చేయించారు. కొన్ని రోజుల తర్వాత అంతకు ముందు 8 ఎకరాలు కొనుగోలు చేసిన వారు మళ్లీ వెంకటనారాయణ ను కలిసి మిగులు భూమిని మాకు అమ్మాలని కోరారు. దీంతో భూ యజమాని మిగిలిన భూమిని మీకు ఇవ్వలేను…ఆ భూమిని గట్టు ఎస్ఐ తాలూకు వారికి అమ్మానని చెప్పడంతో వారు గట్టు ఎస్సైని కలిసారు. ఈ క్రమంలో ఎస్సైకి, కొనుగోలు దారుల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లాలో చర్చానీయాంశంగా మారింది.
తాను కొనాలనుకున్న భూమి తమకు దక్కలేదన్న కోపంతో సరోజమ్మ, వీరేష్ లక్ష్మీలు గద్వాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అట్టి భూమిపై క్రయ విక్రయాలను ఆపాల్సిందిగా వినతిపత్రం ఇచ్చారు.
తన బందువులు కొన్న భూమి రిజిస్ట్రేషన్ ఆపాలంటూ ఎందుకు కంప్లైంట్ చేశావని సరోజమ్మ, వీరేష్ లక్ష్మిల బంధువు నర్సింహులుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు గట్టు ఎస్సై శ్రీనివాస్. నరసింహులు మాత్రం ఎసై నన్ను స్టేషన్ కు పిలిపించి నా పై చేయి చేసుకున్నాడని, ఎస్సై పై చర్యలు తీసుకోవాలని గద్వాల ఎస్పీ కి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై విచారణ జరిపిస్తానని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఎస్సై, భూ కొనుగోలు దారుల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లాలో ఎస్సై వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎస్.ఐ వ్యవహారం రచ్చ.. రచ్చ కావడంతో ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేశారు. విచారణ అనంతరం ఎస్.ఐ. పై సస్పెండ్ వేటు పడే అవకాశముంది.