వీఎన్ఆర్ కాలేజ్ విద్యార్థి మృతిపై వివాదం రాజుకుంటోంది. తమ కుమారుడు చావుకు యాజమాన్యమే కారణమని కాలేజ్ ముందు నిరసనకు దిగారు విద్యార్థి కుటుంబసభ్యులు, బంధువులు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా బాచుపల్లి వీఎన్ఆర్ బాలుర వసతి గృహంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి శివనాగులు చనిపోయాడు. జీవితంపై విరక్తితోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ దొరికింది. భవనంపై అంతస్తు నుంచి దూకి చనిపోయాడని చెబుతున్నారు.
అయితే.. కుమారుడి చావును తట్టుకోలేక అతడి తల్లి జాతీయ రహదారిపై వాహనాల కిందకు పరుగులు పెట్టింది. శివ నాగును కాలేజ్ యాజమాన్యమే చంపి బిల్డింగ్ మీద నుండి పడేసిందని బంధువులు ఆరోపిస్తున్నారు. జాతి పేరుతో దూషించి ఉన్నత చదువులు చదవకుండా చంపేశారని మండిపడుతున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు కూడా కాలేజ్ దగ్గరకు చేరుకుని నిరసనకు దిగారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా పోలీసులు, భద్రతా బలగాలు మోహరించాయి.
సూసైడ్ నోట్ గా చెబుతున్నది శివనాగులు రాయలేదని చెబుతున్నారు కుటుంబసభ్యులు. అది అతని హ్యాండ్ రైటింగ్ కాదంటున్నారు. తాము కాలేజ్ కి వచ్చే లోపే శవాన్ని తరలించారని.. ఎవరో కొట్టి చంపారని అనుమానిస్తున్నారు.