– అప్పట్లో సారు.. కారు.. పదహారు నినాదం
– ప్లాన్ బెడిసి కొట్టడంతో యూటర్న్
– హుజూరాబాద్ దెబ్బతో మళ్లీ రివర్స్
– థర్డ్ ఫ్రంట్ అంటూ హడావుడి
– ఇదంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎత్తుగడేనా?
– బీజేపీ హవా కొనసాగితే మళ్లీ యూటర్నేనా?
కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని ఢీకొడుతూ వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ కే చుక్కలు కనపడుతున్నాయి. అలాంటి ఏడుగురు ఎంపీలతో కేసీఆర్ సాధించేది ఏంటి? పైగా.. దేశంలో బీజేపీని కూకటివేళ్లతో పెకిలిస్తామని ప్రకటనలు.. యూపీఏ కూటమి పార్టీలతో భేటీలు.. ఇదంతా చూసిన రాజకీయ విశ్లేషకులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎరువుల ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో తీవ్రస్థాయిలో కేంద్రాన్ని ఎటాక్ చేశారు కేసీఆర్. ఏకంగా ఈ విషయంపై ప్రధానికి లేఖ రాసి ఘాటైన విమర్శలు చేశారు. అయితే.. ఈ విషయంలో కేసీఆర్ కు దిమ్మతిరిగే కౌంటర్స్ కూడా బీజేపీ సైడ్ నుంచి వినిపిస్తున్నాయి. సారు.. మీరిస్తానన్న ఫ్రీ ఎరువుల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు కమలనాథులు. ఎన్నికలు వస్తే చాలా లేనిపోని హామీలు ఇవ్వడం తర్వాత దాన్ని మర్చిపోయేలా మాయ చేయడం మీకే చెల్లుతుందని రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.
నిజానికి బీజేపీ లీడర్ల వాదనలో నిజం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ బహిరంగంగానే ఉచిత ఎరువుల ప్రకటన చేశారు. ఇప్పటిదాకా గుప్పెడు ఎరువులను కూడా ఫ్రీగా ఇచ్చింది లేదు. అలాంటిది కేంద్రంపై ఎరువుల విషయంలో ఆయన విమర్శలు చేయడం చూసి నవ్వుతున్నారని చెబుతున్నారు. అటు థర్డ్ ఫ్రంట్ అంటూ ఈమధ్య హడావుడి చేస్తూ బీజేపీని ఢీ కొడుతున్నారు కేసీఆర్. అందులోభాగంగానే విమర్శల దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇచ్చిన హామీలు, అమలుపైనా చర్చ జోరందుకుంటోంది.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. కీలకమైన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఓటమి ఖాయమని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే కేంద్రానికి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. అందుకే.. థర్డ్ ఫ్రంట్ నినాదం ఎత్తుకున్నారని.. ఒకవేళ యూపీలో బీజేపీ గెలిస్తే ఆ తర్వాత ఆయన స్వరం మారినా మారొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. గతంలో కేసీఆర్ అనుసరించిన విధానాలు అలాంటివే.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో సారు.. కారు.. పదహారు.. సర్కారు అనే నినాదంతో టీఆర్ఎస్ బరిలోకి దిగింది. ఫలితాల తర్వాత కథ అడ్డం తిరిగింది. కేంద్రంలో ఎన్‌డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాగా… రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటిదాకా జాతీయ రాజకీయాలపై హంగామా చేసిన కేసీఆర్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. థర్డ్ ఫ్రంట్ ఉసెత్తడం మానేశారు. పైగా కీలక సమయాల్లో ఉభయ సభల్లో బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాతే కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందంటున్నారు విశ్లేషకులు. కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం.. థర్డ్ ఫ్రంట్ అంటూ పలు పార్టీల నేతలను కలవడం ఇదంతా పెద్ద వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మళ్లీ బెడిసి కొడితే.. పాత పద్ధతి అవలంబించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇవన్నీ లెక్కలేసుకుంటున్న ప్రాంతీయ పార్టీలు.. అసలు కేసీఆర్ ను నమ్మాలా? లేదా? అనే మీమాంసలో ఉన్నాయట.