ర్యాడిసన్ బ్లూ పుడ్డింగ్ అండ్ మింక్ డ్రగ్స్ వ్యవహారంలో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. పోలీస్ ఉన్నతాధికారుల తీరుపై పలు సందేహాలు వక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి సీఐని సస్పెండ్ చేస్తూ చేతులు దులుపుకున్న ఉన్నతాధికారులు అసలు విషయాన్ని తొక్కి పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారం అంతా ఏసీపీ సుదర్శన్ కనుసన్నల్లోనే జరిగిందనే ప్రచారం జరుగుతోంది. సిద్దిపేట కమిషనర్ గా పనిచేసిన వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ కి కూడా ఈ దందా పై సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతర్గత విచారణలో ఈ విషయాలన్నీ బయటపడినట్లుగా సమాచారం.
ఇందులో ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నా.. సీఐని బలిపశువు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఆమధ్య టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కారు ప్రమాదం కేసులో చక్రం తిప్పిన డీసీపీ, ఏసీపీ.. కొంతకాలంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ పార్టీలు జోరుగా సాగుతున్నా పట్టించుకోలేదని తెలుస్తోంది. గంజాయిని పట్టుకొని పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటూ డ్రగ్స్ దందాపై ఫోకస్ తగ్గించారనే ప్రచారం జరుగుతోంది.
తనిఖీల్లో కొకైన్, గంజాయి, ఎల్ఎస్డీని భారీగా గుర్తించారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఇంత దందా నడుస్తున్నా ఇన్నాళ్లూ బయటకు రాలేదంటే.. ఏ రేంజ్ లో మ్యానేజ్ చేశారో అర్థం అవుతోంది.